Answer:
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (Marathi: भीमराव रामजी आंबेडकर) (డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ (Marathi: डॉ. बाबासाहेब आंबेडकर) గా కూడా పిలవబడిన) ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి.[4][5]
ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పని చేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు.[6]
1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు.[7] ఇతను చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును “అంబేడ్కర్ జయంతి” గా జరుపుకుంటారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను మొదటి స్థానంలో ఎంపికైయ్యాడు.[8]
Explanation: